మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        వినోదం

ఆస్కార్‌ బరిలో రెహమాన్‌

Updated:2016-12-15 19:01:45

Views:165

లాస్‌ ఏంజెలెస్‌: సంగీత మాంత్రికుడు, స్వర సామ్రాట్‌ ఏఆర్‌ రెహమాన్‌ మరోసారి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ బరిలో నిలిచారు. ఈ ప్రపంచ ప్రఖ్యాత అవార్డును ఆయన ఇప్పటికే రెండుసార్లు ఒడిసిపట్టారు. ముచ్చటగా మూడోసారి కూడా ఆయన్ను ఆస్కార్‌ వరించే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజ క్రీడాకారుడు పీలే జీవితగాథ ‘పీలే: బర్త్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌’ సినిమాకు ఆయన ఉర్రూతలూగించే సంగీతాన్ని స్వరపరిచిన సంగతి తెలిసిందే. దీనిలో ‘జింగా’ పాట మనల్ని ఫుట్‌బాల్‌ ప్రపంచంలోకి తీసుకుపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెహమాన్‌ను ఆస్కార్‌ వైపు నడిపిస్తోంది కూడా ఈ పాటే. ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో 145 పాటలతో ఇది పోటీ పడుతోంది. మరోవైపు ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలోనూ ఇది 91 పాటలతో పోటీకి నిలిచింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ ఈ జాబితా విడుదలచేసింది. ఈ అకాడమీనే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజేతల పేర్లు ప్రకటిస్తుంది. పీలే సినిమాకు మైఖేల్‌ జింబాలిస్ట్‌, జెఫ్‌ జింబాలిస్ట్‌లు దర్శకత్వం వహించారు. దీంతోపాటు స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌, 127 హవర్స్‌, కపుల్స్‌ రీట్రీట్‌, మిలియన్‌ డాలర్‌ ఆర్మ్‌, ద హండ్రెడ్‌ ఫూట్‌ జర్నీ, మొహమ్మద్‌ లాంటి ప్రఖ్యాత హాలీవుడ్‌ సినిమాలకూ రెహమాన్‌ సంగీతమందించారు. 2009లో స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ సినిమానే ఆయనకు జంట ఆస్కార్‌లను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ‘రోగ్‌ వన్‌: ఏ స్టార్‌ వార్‌ స్టోరీ’, లా లా ల్యాండ్‌, మోనా, ఫ్లోరెన్స్‌ ఫోస్టెర్‌ జెర్కిన్స్‌’ లాంటి సినిమాలూ ఆస్కార్‌ సంగీత బరిలో పోటీపడుతున్నాయి. వీటిలో అత్యధిక ఓట్లు దక్కిన తొలి ఐదింటిని అవార్డుకు నామినేట్‌ చేస్తారు. అనంతరం మళ్లీ ఓటింగ్‌ నిర్వహించి వాటిలో తుది విజేతను ప్రకటిస్తారు. హాలీవుడ్‌లోని డోల్బే థియేటర్‌లో అవార్డులను ప్రదానం చేస్తారు.