మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్        న్యూస్

పతంజలి సంస్థకు రూ.11 లక్షల జరిమానా

Updated: 2016-12-15 18:10:39 Views: 450

హరిద్వార్‌: యోగా గురు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద కంపెనీకి హరిద్వార్‌లోని జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు జరిమానా విధించింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, తప్పుడు ప్రకటనల ద్వారా వినియోగదారులను పక్కదోవ పట్టించిందన్న అభియోగాలు నిరూపణ కావడంతో రూ.11 లక్షలు జరిమానాగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇతర సంస్థలు తయారు చేసిన వస్తువులను తమ బ్రాండ్‌ పేరిట ప్రకటనల్లో పేర్కొని వినియోగదారులను పక్కదోవ పట్టించి ఆదాయాన్ని పెంచుకోవాలని కంపెనీ చూస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్‌ 52, 53 కింద తప్పుడు ప్రకటనలు, వినియోగదారులను పక్కదోవ పట్టించడం వంటి నేరాలతో పాటు ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని నేరం కింద జరిమానా విధిస్తూ.. నెల రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆహార నాణ్యత ప్రమాణాల శాఖను ఆదేశించింది.

షేర్ :


రాజకీయం

ప్రాజెక్టుల కోసం ఒక్కపైసా అప్పు చేయలేదు

నీటిపారుదల ప్రాజెక్టుల కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా అప్పు చేయలేదని జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై వివరణ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీటి కోసమే జరిగిందని.. రాష్ట్రం ఏర్పడి తర్వాత ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టుల కోసం పదేళ్ల కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మొత్తం రూ.39 వేల కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లోనే రూ.. 22వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. ఈ నిధులన్నీ రాష్ట్ర ఖాతాలోనివేనని.. ఎవరి నుంచి అప్పు తీసుకురాలేదని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల వూబిలోకి నెట్టుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని పేర్కొన్నారు.


జనరల్‌

సుపరిపాలనతోనే వాజ్‌పేయీకి ప్రఖ్యాతులు

ప్రజలకు సుపరిపాలన అందించడం ద్వారా మాజీ ప్రధాని వాజ్‌పేయీ అంతర్జాతీయ స్థాయిలో మంచిపేరు తెచ్చుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన వాజ్‌పేయీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల జీవితాలు బాగుపడాలని వాజ్‌పేయీ తరుచూ చెప్పేవారని.. ఇప్పుడు మోదీ దానిని ఆచరణలో పెడుతున్నారని అన్నారు. మంచి పనులు చేయడానికి దేశాన్ని బాగుచేయడానికి మోదీ ప్రధాని అయ్యారని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 31 తర్వాత సామాన్యులు కష్టాలు తొలగి అక్రమంగా డబ్బులు సంపాదించిన వారికి కష్టాలు మొదలవుతాయన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రజలందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. వాజ్‌పేయీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆయన వస్త్రాలు పంపిణీ చేశారు.