'మంద"లోడో మాయలోడో..
సాగర్ మాములోడు కాదు
దీక్షిత్‌రెడ్డి హత్య కేసులో సాగర్‌ను మహబూబాబాద్ పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం 5.30గం.కు దీక్షిత్‌ను సాగర్ ద్విచక్రవాహనంపై తీసుకెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. కేసముద్రం మండలం అన్నారం వద్ద దానమయ్య గుట్టలపైకి తీసుకెళ్లాడని చెప్పారు. బాలుడు భయంగా ఉందని చెబితే తన వద్ద మాత్రలు ఉన్నాయని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇలా ప్లాన్ చేశాడు..బాలుడు ఇంటికి తీసుకుపోవాలని ఏడవడంతో నిద్రమాత్రలు ఇచ్చాడని ఎస్పీ మీడియా ముందు తెలిపారు. స్పృహతప్పిన తర్వాత చేతులు కట్టేసి టీషర్ట్‌తో మెడకు బిగించి చంపాడని వివరించారు. అనంతరం మహబూబాబాద్ వచ్చి పెట్రోల్ తీసుకుని వెళ్లి మృతదేహం తగులబెట్టాడని చెప్పారు. గుట్టపైకి వెళ్లి గొంతు మార్చి నిందితుడు దీక్షిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడని వెల్లడించారు. దానమయ్య గుట్టలపై నుంచే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.నిందితుడు సాగర్... బాలుడు దీక్షిత్‌రెడ్డి ఇంటి పక్కనే ఉంటాడని ఎస్పీ వెల్లడించారు. తెలిసిన వాళ్లే కిడ్నాప్ చేసి ఉంటారన్న కోణంలోనే విచారణ చేసినట్లు స్పష్టం చేశారు. సాగర్ స్థానికుడు కావడంతో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో అవగాహన ఉందని.. కిరాణా, ఔషధాల దుకాణాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించినట్లు ప్రకటించారు. రాత్రిపూట కావడంతో దృశ్యాలు సరిగా కనిపించలేదన్నారు. కేసును త్వరగా ఛేదించాలని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించామని తెలిపారు. హాంకాంగ్, అమెరికా నుంచి జనరేట్ అయి వచ్చినట్లు కాల్స్ వచ్చాయని వివరించారు. ఐపీ అడ్రస్సులతో ఏ అప్లికేషన్స్ ఎక్కువగా వాడుతున్నారో పరిశీలించామని స్పష్టం చేశారు. ఇంటర్‌లింక్ చేసి పరిశీలించినప్పుడు మూడ్రోజుల్లో నిందితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈజీ మనీకోసం..డబ్బు సంపాదించాలన్న దురాశతో మంద సాగర్ ఒక్కడే దారుణానికి పాల్పడ్డాడని ఎస్పీ వివరించారు. కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే చంపడం వల్ల బాలుడిని కాపాడలేకపోయామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడు సాగర్‌ను ఇవాళ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్‌లో 500 నుంచి 1000 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.