SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు

Updated: 2020-09-24 04:04:44

హైదరాబాద్ మహా నగర ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే. ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు శుక్రవారం నుంచి రోడ్డెక్కనున్నాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం నగర శివార్లలోని బస్సు డిపోల నుంచి ఇతర ప్రాంతాలకు పాక్షికంగా బస్సులను నడిపారు. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో నగరవ్యాప్తంగా బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ వర్గాల ద్వారా తెలిసింది. కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండే రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, హకీంపేట, ఫలక్‌నుమా, మిథాని, మియాపూర్, హయత్‌నగర్‌ వంటి శివారు డిపోల నుంచి బస్సులను బుధవారమే ప్రారంభించారు. ఈ డిపోల నుంచి 12 బస్సుల చొప్పున సర్వీసులను నడుపుతున్నారు. సిటీ సబర్బన్ ఏరియాకు 15 కి.మీ. దూరంలో బస్సులను నడుపుతున్నారు. నగర శివారు గ్రామాల్లోని ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇక శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.గ్రేటర్‌లో 3798 ఆర్టీసీ బస్సులున్నాయి. ఐతే గతేడాది సమ్మె కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా కొన్ని బస్సు సర్వీసులను పక్కనబెట్టారు. మిగిలిన 3298 బస్సులతో గ్రేటర్‌ బస్సులు 9 లక్షలకు పైగా కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ 34 లక్షలమంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. వీటి ద్వారా గ్రేటర్‌ ఆర్టీసికి రోజువారి ఆదాయం రూ. 3 కోట్ల 50 లక్షలు సమకూరుతుంది. ఐతే కరోనా లాక్‌డౌన్‌తో ఆర్టీసీ పూర్తిగా ఆధాయాన్ని కోల్పోయింది. ప్రస్తుతం అన్‌లాక్ 4 దశలో మెట్రో రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఏపీలోనూ సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సిటీ బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు