SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

గృహరుణాలు మాఫీ

Updated: 2016-12-28 11:26:32

ప్రభుత్వ పక్కా ఇళ్లు పొందిన లబ్ధిదారుల గృహ రుణ బకాయిలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 1983 నుంచి 2014 వరకు ఉన్న రూ.3,920 కోట్ల రుణ భారాన్ని తొలగిస్తున్నట్లు వెల్లడించారు. రుణాల కోసం లబ్ధిదారులు బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఇళ్ల పట్టాలను నెల రోజుల్లో ఇప్పిస్తామని తెలిపారు. గ్రామీణ పక్కా ఇళ్లు(ఆర్‌పీహెచ్‌), పట్టణ పక్కా ఇళ్లు(యూపీహెచ్‌), బీడీ కార్మికులు, మత్స్య కార్మికుల ఇళ్లతోపాటు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాలన్నింటా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, బ్యాంకు రుణం, లబ్ధిదారుడి వాటా ఉంటుంది. ఇందులో ప్రస్తుతం లబ్ధిదారులు బ్యాంకుకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ మాఫీ చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. గత పదేళ్లుగా ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఈ రుణాన్ని వసూలు చేసిన దాఖలాలు లేవు.

మంగళవారం అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనతో ఈ బకాయిలన్నీ రద్దయినట్లయింది. అలాగే రాజీవ్‌ స్వగృహ, రాజీవ్‌ గృహకల్ప, ఇందిరమ్మ, పథకాల ఇళ్ల నిర్మాణాలను కొనసాగిస్తామని, ముస్లింల కోసం గృహ నిర్మాణంలో ప్రత్యేక కోటా ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థను మూసివేశామని, ఇకపై బలహీన వర్గాల వారి ఇళ్ల నిర్మాణ బాధ్యతలు జిల్లా కలెక్టర్‌ నిర్వహిస్తారని వివరించారు. మంగళవారం అసెంబ్లీలో రాజీవ్‌ స్వగృహ, రాజీవ్‌ గృహకల్ప, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకంతోపాటు బలహీన వర్గాల గృహ నిర్మాణంపై లఘు చర్చ జరిగింది. విపక్ష నేత జానారెడ్డితోపాటు సభ్యులు డీకే అరుణ, సండ్ర వెంకటవీరయ్య, అక్బరుద్దీన్‌ ఒవైసీ, బలాల తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. బలహీనవర్గాల గృహ నిర్మాణాలకు సంబంధించిన రుణాలను రద్దు చేసినట్లు సీఎం చేసిన ప్రకటనపై జానారెడ్డి స్పందిస్తూ... గతంతో తమ ప్రభుత్వం కూడా ఎన్నడూ ఆ రుణాలను వసూలు చేయలేదన్నారు.