SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

సొంత గ్రామానికి ప్రవాస డాక్టర్‌ సేవ

Updated: 2016-12-23 13:03:20

కరీంనగర్‌ జిల్లా మల్లాపూర్‌ మండలం సాతారం గ్రామానికి చెందిన గండ్ర విద్యాధర్‌రావు వృత్తిరీత్యా హృద్రోగ వైద్య నిపుణుడు. గత 15 సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్డియాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడినప్పటికీ సొంత గ్రామానికి ఎంతో కొంత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఇప్పటివరకు రూ.64లక్షల వరకు విరాళాలు వెచ్చించి పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని సంవత్సరాల కిందట రూ.4.50లక్షలను వాటాగా ప్రభుత్వానికి చెల్లించగా ప్రభుత్వం మరో రూ.8.50లక్షలను కలిపి మొత్తం రూ.12లక్షలను మంజూరు చేసింది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులను సీసీ రహదారులుగా మార్చారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించేందుకు కంప్యూటర్‌లను అందజేశారు. గదులు చాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు విద్యాధర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా రూ.10లక్షల విలువ గల స్వంత ఇంటిని పాఠశాలకు విరాళంగా ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. దీంతో పాటు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆటస్థలం లేక పడుతున్న ఇబ్బందులను గుర్తించి పాఠశాల సమీపంలో తనకు ఉన్న భూమిలో నాలుగుఎకరాల భూమిని క్రీడాస్థలం కోసం కేటాయించారు. ఇటీవల గ్రామ ప్రజలు తాగునీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రూ.4.50 లక్షలతో శుద్ధజల ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పచ్చదనంలో గ్రామస్థులను భాగస్వాములు చేయాలన్న తలంపుతో గత ఏడాది తన పుట్టినరోజును పురస్కరించకుని గ్రామంలో 250 మొక్కలను నాటడంతో పాటు వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేసి వాటి సంరక్షణ బాధ్యతను గ్రామస్థులకు అప్పగించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే తలంపుతో ఉన్న విద్యాధర్‌రావు ఆదర్శప్రాయుడే.