SHARE IT :         

మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్     న్యూస్

రూ. 340 లక్షల కోట్లు 2015-16 నాటికి వ్యక్తుల సంపద వచ్చే ఐదేళ్ళలో రూ.558 లక్షల కోట్లకు భౌతిక ఆస్తుల్లో 10% వృద్ధి కార్వీ

Updated: 2016-12-15 18:16:52

Views: 419

ముంబయి: వ్యక్తుల సంపద శరవేగంగా పెరుగుతున్నట్లు కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ముగిసేనాటికి రూ.300 లక్షల కోట్ల మైలురాయిని మించిందని పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 8.5 శాతం పెరిగిందని వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో (2022 కల్లా) ఈ విలువ రూ.558 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం భౌతిక రూపంలో ఉండే ఆస్తుల (ఫిజికల్‌ అసెట్స్‌) విలువ 10.32 శాతం పెరిగి రూ.132 లక్షల కోట్లకు చేరింది. ద్రవ్య రూప ఆస్తుల (ఫైనాన్సియల్‌ అసెట్స్‌) విలువ 7.14 శాతం అధికమై రూ.172 లక్షల కోట్లుగా నమోదైంది. 2020- 2021 వరకు వ్యక్తుల సంపదలో ఏటా 12.90 శాతం వృద్ధి ఉంటుందని అనుకుంటున్నట్లు కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అభిజిత్‌ భావే వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ద్రవ్య రూప ఆస్తులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మున్ముందు వ్యక్తుల సంపద విషయంలో చైనా లాంటి దిగ్గజాలను భారత్‌ వెనక్కినెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), స్థిరాస్తి చట్టం, దివాలా చట్టం సహా పలు కీలక సంస్కరణలను ప్రభుత్వం చేపడుతుండటం ఇందుకు దోహదం చేయొచ్చు. పెద్ద నోట్ల రద్దుతో దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుందని.. ఆర్థిక వ్యవస్థలో అధికారిక సంపద మరింత చేరే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. అయితే నల్లధనాన్ని మార్చుకునేందుకు అధికంగా ఉపయోగించే పసిడి, స్థిరాస్తి రూపేణా సంపద తగ్గుముఖం పట్టొచ్చని తెలిపారు. 304 లక్షల కోట్లలో డిపాజిట్ల వాటా 21.40% కాగా.. ఈక్విటీ 17.23%, బీమా 14.81% శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. భౌతిక ఆస్తుల్లో దాదాపు సగం పసిడి మదుపే. ఆ తర్వాత స్థిరాస్తులదే. ఇక వజ్రాలు, వెండి, ప్లాటినం సహా ఇతర ఆభరణాలు, రత్నాల వాటా స్వల్పమే.