Breaking
News
Breaking
News
Updated: 2016-12-16 15:59:47
టైటిల్ ఫేవరెట్ భారత్ జూనియర్ హాకీ ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఓ గోల్ వెనుకబడ్డా పుంజుకుని.. 2-1తో స్పెయిన్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో భారత్ అంచనాలకు తగిన ప్రదర్శన చేయలేకపోయింది. 22వ నిమిషంలో మార్క్ సెరాహిమ గోల్ కొట్టడంతో మొదట స్పెయిన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కిక్కిరిసిన ధ్యాన్‌చంద్ స్టేడియం.. 57వ నిమిషంలో సిమ్రన్‌జీత్ సింగ్ చేసిన గోల్‌తో వూపిరిపీల్చుకుంది. మ్యాచ్‌లో భారత్ మొత్తం తొమ్మిది పెనాల్టీ కార్నర్లు సాధించినా.. రెండింటినే ఉపయోగించుకోగలిగింది. 66వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సద్వినియోగం చేయడంతో భారత్ విజేతగా నిలిచింది. స్పెయిన్‌తో పోరులో భారత్ బంతిపై బాగానే నియంత్రణ సాధించినా తొలి అర్ధభాగంలో పూర్తిగా తేలిపోయింది. ఆటగాళ్ల మధ్య సమన్వయం కొరవడింది. స్పెయిన్ బలమైన డిఫెన్స్‌తో భారత ఫార్వర్డ్లను అడ్డుకుంది. ఐతే ఆరంభంలోనే రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా భారత జట్టు వృథా చేసుకుంది. 22వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు సెరాహిమ పెనాల్టీ కార్నర్ గోల్ సాధించడంతో స్టేడియం నిశ్శబ్దంగా మారిపోయింది. విరామం తర్వాత నాలుగో నిమిషంలో స్పెయిన్ మరో గోల్ కొట్టినంత పనిచేసింది. కానీ సెరాహిమ ప్రయత్నాన్ని భారత గోల్‌కీపర్ వికాస్ దహియా అడ్డుకున్నాడు. భారత్ వరుసగా దాడులు చేస్తూ పోయింది. కానీ గోల్ ప్రయత్నాలను స్పెయిన్ గోల్‌కీపర్ పెరెజ్ సఫలం కానివ్వలేదు. ఎట్టకేలకు ఐదో పెనాల్టీ కార్నర్‌ను ఉపయోగించుకున్న భారత్.. స్కోరును 1-1తో సమం చేసింది. చివరి పదినిమిషాల్లో భారత్‌కు మరో నాలుగు పెనాల్టీ కార్నర్లు దక్కగా.. ఒక దాన్ని హర్మన్‌ప్రీత్ (66వ) గోల్‌గా మలిచాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో భారత్.. ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా 2-1తో నెదర్లాండ్స్‌పై గెలిచింది. మరో సెమీస్‌లో బెల్జియం, జర్మనీ తలపడతాయి. క్వార్టర్స్‌లో జర్మనీ 4-2తో ఇంగ్లాండ్‌పై నెగ్గగా.. బెల్జియం షూటౌట్లో 4-1తో అర్జెంటీనాను ఓడించింది.